SV Ranga Rao: అభినయ చక్రవర్తి … యస్.వి.రంగారావు!

యస్వీ రంగారావు తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల మదిలో చెప్పరాని ఆసక్తి తొణికిసలాడేది. ఎందుకంటే తెర నిండుగా ఉండే ఆ విగ్రహం – నటనలో నిగ్రహం – పాత్రకు తగిన ఆగ్రహం – అనువైన చోట ప్రదర్శించే అనుగ్రహం– అన్నీ రంగారావు నటనలో మెండుగా కనిపించేవి. అందుకే ఆయన వెండితెరపై కనిపించారంటే జనానికి ఆనందం. అనేక అపురూపమైన పాత్రల్లో అనితరసాధ్యంగా తన అభినయంతో అలరించారు రంగారావు.
సామర్ల వెంకట రంగారావు 1918 జూలై 3న కృష్ణాజిల్లా నూజివీడులో జన్మించారు. రంగారావు తండ్రి కోటీశ్వరనాయుడు ఎక్సైజు శాఖలో పనిచేసేవారు. దాంతో పలు ఊళ్ళు మారుతూ ఉండడం వల్ల రంగారావు నాయనమ్మ పిల్లలను తీసుకొని మద్రాసు చేరారు. ఎస్వీఆర్ చదువు అక్కడే సాగింది. మద్రాసు హిందూ హైస్కూల్ లో చదివే రోజుల్లో పదిహేనవ ఏట తొలిసారి నాటకంలో నటించారు రంగారావు. తరువాత స్కూల్ లో ఏ నాటకం జరిగినా అందులో రంగారావు నటిస్తూ ఉండేవారు.
నాటి మేటి రంగస్థల నటులు బళ్ళారి రాఘవ, గోవిందరాజుల సుబ్బారావు నటించిన నాటకాలు చూసి, వారిలాగే తానూ ఏ రోజుకైనా నటుడు కావాలని తపించారు రంగారావు. మద్రాసులో ఎస్.ఎస్.ఎల్.సి. దాకా చదివిన రంగారావు, తరువాత విశాఖపట్నంలోని మిసెస్ ఎ.వి.ఎన్. కళాశాలలో ఇంటర్మీడియట్, కాకినాడలోని పి.ఆర్. కళాశాలలో బియస్సీ పూర్తి చేశారు. కాకినాడలోని ‘యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్’లో చేరి పలు నాటకాల్లో నటించారు. అక్కడే అంజలీదేవి, ఆదినారాయణరావు, బి.ఏ.సుబ్బారావు, రేలంగి వంటి సినీనటులతో రంగారావుకు పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ళు బందరు, విజయనగరంలో ఫైర్ ఆఫీసర్ గా పనిచేశారు. ఆయన మనసు మాత్రం నటనవైపు మళ్ళుతూ ఉండేది. దర్శకుడు బి.వి. రామానందం, యస్వీఆర్ కు దూరపు బంధువు. ఆయన తెరకెక్కించిన ‘వరూధిని’ చిత్రంలో ప్రవరాఖ్యుని పాత్రలో తొలిసారి తెరపై కనిపించారు రంగారావు. ఇందులో నటి గిరిజ తల్లి దాసరి తిలకం ఆయన సరసన నటించారు. ఈ చిత్రం పరాజయం పాలు కావడంతో యస్వీఆర్ కు ఆట్టే అవకాశాలు రాలేదు. ఆ సమయంలో జెమ్ షెడ్ పూర్ లోని టాటా కంపెనీలోనూ కొంతకాలం ఉద్యోగం చేశారు రంగారావు. తరువాత బి.ఏ.సుబ్బారావుతో ఉన్న పరిచయం కారణంగా ఆయన తెరకెక్కించిన ‘పల్లెటూరి పిల్ల’లో ఓ చిన్న పాత్రలో నటించారు అదే సమయంలో యల్వీ ప్రసాద్ తెరకెక్కిస్తోన్న ‘మనదేశం’లోనూ ఓ చిన్న పాత్రలో కనిపించారు రంగారావు. విజయావారి తొలి చిత్రం ‘షావుకారు’లో సున్నపు రంగడు పాత్రతోనే రంగారావుకు మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత అదే విజయావారి ‘పాతాళబైరవి’లో నేపాలమాంత్రికునిగా నటించేసి, జనం మదిని దోచారు రంగారావు.
‘పాతాళభైరవి’ ఘనవిజయంతో రంగారావు మరి వెనుదిరిగి చూసుకోలేదు. తనకు లభించిన పాత్రల్లో రంగారావు ఇట్టే ఒదిగిపోయేవారు. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాల్లో రంగారావు అనేక మరపురాని పాత్రలతో జనాన్ని ఆకట్టుకున్నారు. యన్టీఆర్, ఏయన్నార్ నటించిన అనేక చిత్రాలలో కేరెక్టర్ రోల్స్ లో యస్వీఆర్ అలరించిన తీరు మరపురానిది. తెలుగులోనే కాక తమిళ,కన్నడ, హిందీ భాషల్లోనూ రంగారావు నటించి అలరించారు. 1964లో ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన ‘ఆఫ్రో-ఏసియన్ ఫిలిమ్ ఫెస్టివల్’లో ‘నర్తనశాల’లోని కీచక పాత్ర ద్వారా ఆయనకు ఉత్తమ నటునిగా అవార్డు లభించింది. ‘చదరంగం’, ‘బాంధవ్యాలు’ చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. నటసమ్రాట్, నటసార్వభౌమ, విశ్వనటచక్రవర్తి వంటి బిరుదులతో యస్వీఆర్ ను జనం గౌరవించారు. చివరి దాకా తనదైన బాణీ పలికిస్తూ నటించిన యస్వీఆర్ 1974 జూలై 18న తనువు చాలించారు.
నవతరం ప్రేక్షకులను సైతం బుల్లితెరపై యస్వీఆర్ పాత్రలు ఆకర్షిస్తూనే ఉండడం విశేషం! ముఖ్యంగా “పాతాళభైరవి, పెళ్ళిచేసిచూడు, మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మకథ, నర్తనశాల, నాదీ ఆడజన్మే, ఆత్మబంధువు, బాలభారతం, యశోదకృష్ణ, దేవుడు చేసిన మనుషులు” వంటి చిత్రాల్లోని ఆయన నటన ఇప్పటికీ తెలుగువారిని కట్టి పడేస్తోంది.
from NTV Telugu https://ift.tt/ghixTjR
Post a Comment
Post a Comment