Kota Srinivasa Rao : మాటలతోనే ‘కోట’లు కట్టిన ఘనుడు!

తెలుగు చిత్రసీమలో ఎందరో హాస్యనటులు తమదైన అభినయంతో ఆకట్టుకున్నారు. కొందరు కేవలం నవ్వులే కాదు, కన్నీరు పెట్టించారు, మరికొందరు కసాయితనం చూపించీ ప్రతినాయకులుగానూ మెప్పించారు. ఆ తరహా పాత్రల్లోనూ నవ్వకుండా నవ్వులు పూయించడం అన్నది కత్తిమీద సాములాంటిది! అలాంటి సాములను అనేకమార్లు అవలీలగా చేసిన ఘనుడు కోట శ్రీనివాసరావు. ఇప్పుడంటే కోట శ్రీనివాసరావు వయసు మీద పడడం వల్ల మునుపటిలా నవ్వులు పూయించలేక పోతున్నారు కానీ, అప్పట్లో కోట పండించిన నవ్వుల పంటలు తలచుకొని ఇప్పటికీ పడిపడి నవ్వేవారు ఎందరో ఉన్నారు. ఆయన మాటలు కోటలు దాటేలా ఉంటాయి, కోట్లూ కుమ్మరించాయి. బాక్సాఫీస్ రికార్డులు బీటలు వారేలా చేశాయి. ఎందరికో గెలుపు బాటలూ వేశాయి. అందుకే కోట శ్రీనివాసరావు మాటంటే తెలుగువారికి మహా ఇష్టం.
కోట శ్రీనివాస రావు 1943 జూలై 10న విజయవాడ సమీపంలోని కంకిపాడులో జన్మించారు. కలలుంటాయి అందరికీ, అవి నెరవేరేది కొందరికే! కళలన్నవి కొందరికే – అవి నెరవేరాలంటే గుమ్మడి కాయంత ప్రతిభకన్నా ఆవగింజంత అదృష్టం కావాలి అంటారు పెద్దలు. కోట శ్రీనివాసరావులో పేద్ద పనసకాయంత ప్రతిభ ఉంది. కానీ, ఆరంభంలో ఆవగింజంత అదృష్టం వరించలేదు. 1978లో వచ్చిన ‘ప్రాణం ఖరీదు’తోనే తొలిసారి తెరపై కనిపించారు కోట. అయితే ఆయన నవ్వుల బాట తెలుగువారికి పరిచయం కావడానికి జంధ్యాల మెగాఫోన్ పట్టి రూపొందించిన చిత్రాలే కారణం! జంధ్యాల చిత్రాలు కోట అభినయానికి పెద్ద పీట వేశాయి. ప్రతీసారి కోట మార్కు నటన ప్రేక్షకుల చేత మార్కులు వేయించుకుంటూనే సాగింది. తరువాత ఓ వైపు ఇ.వి.వి. సత్యనారాయణ, మరోవైపు ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో అలరించారు కోట. రామ్ గోపాల్ వర్మ, ఆయన శిష్యగణం చిత్రాల్లోనూ కోట తనదైన పంథాలో పయనించి ప్రేక్షకులను పరవశింప చేశారు. హాస్యనటునిగా, గుణచిత్ర నటునిగా పలుమార్లు అవార్డులూ, రివార్డులూ సంపాదించారు కోట. అయితే ప్రతినాయకునిగా నాలుగు సార్లు నందులు అందుకున్న ఘనత ఆయనకు మాత్రమే దక్కింది. “గాయం, తీర్పు, గణేశ్, చిన్నా” చిత్రాల ద్వారా కోట ఈ ఘనత సాధించారు. ఇవి కాకుండా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ‘పథ్వీనారాయణ’తోనూ, బెస్ట్ కేరెక్టర్ యాక్టర్ గా రెండు సార్లు “ఆ నలుగురు, పెళ్ళయిన కొత్తలో” చిత్రాలతో నంది అవార్డులు సొంతం చేసుకున్నారాయన.
తన మాటల తూటాలతో ప్రేక్షకులకు వినోదం పంచిన కోట రాజకీయాల్లోనూ అడుగు పెట్టారు. 1999లో బీజేపీ అభ్యర్థిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు కోట. తరువాత ఓటమి చవిచూసిన కోట, మళ్ళీ నటనలోనే కొనసాగారు. అయితే, ఇప్పటికీ బీజేపీలోనే కొనసాగుతున్నారు. 2015లో కోటకు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో పరకాయప్రవేశం చేసి మునుపటిలా వినోదం పంచాలనే ఉత్సాహంతోనే ఉన్నారాయన. 80వ పడిలో అడుగు పెట్టిన కోట శ్రీనివాసరావు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిద్దాం.
from NTV Telugu https://ift.tt/r92gWQB
Post a Comment
Post a Comment