Siddipet District: హృదయవిదారక ఘటన.. తన చితి తానే పేర్చుకుని 90 ఏళ్ల వృద్ధుడి ఆత్మాహుతి


తన రెక్కల కష్టం మీద సంసారాన్ని ఈది జీవిత చరమాంకానికి చేరుకున్నాడు. తన కంటే ముందే భార్య తనువు చాలించడంతో తొంబై ఏళ్ల వయసుతో ఆ తండ్రిని పోషించడానికి సంతానం వంతులు వేసుకున్నారు. తన పోషణ తనయులకు భారం కాకూడదని ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోయి.. తన చేతులతో తానే చితి పేర్చుకుని ఆత్మాహుతికి పాల్పడి తనువు చాలించాడు. ఈ హృదయవిదారక ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో గ్రామంలో జరిగింది. వివరాల్లోకెళ్తే..
పొట్లపల్లి గ్రామానికి చెందిన మెడబోయిన వెంకటయ్య (90)కు నలుగురు కుమారులు. ఓ కుమార్తె ఉన్నారు. వెంకటయ్య భార్య గతంలోనే చనిపోయింది. కుమారుల్లో ఇద్దరు పొట్లపల్లిలోనే కాపురం ఉండగా, ఒకరు హుస్నాబాద్‌లో, మరొకరు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటలో నివసిస్తున్నారు. కుమారులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. వయసై పోవడంతో వెంకయ్య తనకున్న నాలుగెకరాల భూమి కుమారులకు పంచేశారు. వెంకయ్యకు వృద్ధాప్య పింఛను వస్తుంది. గ్రామంలోనే ఉంటున్న పెద్ద కుమారుడు కనకయ్య వద్ద ఉండేవారు. ఐతే 5 నెలల క్రితం వెంకయ్య పోషణ నిమిత్తం పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. నెలకు ఒకరు చొప్పున నలుగురు కుమారులు వంతులవారీగా తండ్రిని పోషించాలని నిర్ణయించారు. గ్రామంలో ఉంటున్న పెద్ద కుమారుడు వంతు పూర్తి కావడంతో నవాబుపేటలోని రెండో కుమారుడి వద్దకు వెళ్లాల్సి ఉంది.
దీంతో సొంత ఊరిని, ఇంటిని వదిలి వెళ్లడం ఇష్టంలేని వెంకయ్య గత మంగళవారం అదే గ్రామంలోని ఓ ప్రజాప్రతినిధి ఇంటికి వెళ్లి తన బాధ వెళ్లగక్కారు. ఈ రోజు రాత్రంతా అక్కడే ఉండి మరుసటి రోజు (మే 3) ఉదయం నవాబుపేటలోని తన మరో కుమారుడి వద్దకు వెళ్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయిన వెంకయ్య ఏ కుమారుడి ఇంటికీ చేరలేదు. గురువారం మధ్యాహ్నం పొట్లపల్లి గ్రామంలో ఎల్లమ్మగుట్ట వద్ద మంటల్లో కాలిన స్థితిలో వృద్ధుడి మృతదేహం ఉండటంతో పోలీసులు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ఆ మృతదేహం వెంకటయ్యదేనని గుర్తించారు. వెంకయ్య చితి పేర్చుకుని మంటరాజేసి దానిలో దూకి ఆత్మాహుతికి పాల్పడినట్లు ఏఎస్‌ఐ మణెమ్మ ప్రాథమిక నిర్ధారణక వచ్చారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/TmFOq9j
Post a Comment
Post a Comment