Lingusamy: బన్నీతో సినిమా.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్

Lingusamy Clarity On Bunny

2016లో లింగుసామి, అల్లు అర్జున్ కాంబోలో ఓ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చిన సంగతి గుర్తుందా? తమిళనాడులో గ్రాండ్‌గా ఓ ఈవెంట్ కూడా నిర్వహించారు. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ గురించి పెద్ద హడావుడే నడిచింది. కానీ, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎలాంటి ఊసే రాలేదు. భారీస్థాయిలో ప్రకటించిన ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. రెండు, మూడు సార్లు ఈ సినిమాకి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయన్న వార్తలు వచ్చాయే తప్ప.. యూనిట్ వర్గాల నుంచి మాత్రం ఏ సమాచారమూ రాలేదు. చూస్తుండగానే ఈ ప్రాజెక్ట్‌ని అంతా మర్చిపోయారు. అటు లింగుసామి, ఇటు అల్లు అర్జున్ వేరే ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు. దీంతో, ఇది అటకెక్కినట్టేనని అంతా ఫిక్సైపోయారు.

అంతేకాదు.. ఇప్పుడు ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో చేసిన ‘ద వారియర్’ సినిమా అల్లు అర్జున్ రిజెక్ట్ చేసినదేనని ప్రచారమూ ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే ఇది నిజమా? కాదా? అసలు బన్నీతో ప్రాజెక్ట్ ఏమైంది? అనే వివరాలు తెలుసుకోవడం కోసం.. ‘ద వారియర్’ ప్రచార కార్యక్రమాల్లో ఉన్న దర్శకుడు లింగుసామిని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఎట్టకేలకు తాజా ఇంటర్వ్యూలో ఆయన పెదవి విప్పారు. తాను బన్నీతో రెగ్యులర్ టచ్‌లోనే ఉన్నానని, అతనితో చేయాల్సిన ప్రాజెక్ట్ అటకెక్కలేదని క్లారిటీ ఇచ్చాడు. రామ్‌తో తీసిన ద వారియర్ కథ బన్నీ రిజెక్ట్ చేసింది కాదని, అతనికి చెప్పిన కథ మరొకటని స్పష్టం చేశాడు. భవిష్యత్తులో తమ ప్రాజెక్ట్ కచ్ఛితంగా రూపుదాల్చుకుంటుందని చెప్పుకొచ్చాడు.

అయితే.. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప 2’ సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి, కచ్ఛితంగా ఎప్పుడు ముగుస్తుందో క్లారిటీ లేదు. ఆ తర్వాత బోయపాటి శ్రీనుతోనూ బన్నీ ఓ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు. మరి, లింగుసామితో సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో? పైగా.. బన్నీ ఈ మధ్య తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ లెక్కన.. లింగుసామితో సినిమా చేయాలా? వద్దా? అన్నది ‘ద వారియర్’ రిజల్ట్ మీద ఆధారపడి ఉండనుందని చెప్పుకోవచ్చు.



from NTV Telugu https://ift.tt/P1pK7rm

Baca juga

Post a Comment