Shah Rukh Khan : ఇరవై ఏళ్ళ షారుఖ్ ఖాన్ ‘దేవ్ దాస్’

‘కథలు కరువైనప్పుడు పాత కథలనే ఆశ్రయించు’ అని పెద్దలు చెప్పారు. అదే తీరున సినీజనం కొత్తసీసాలో పాత సారాలాగా, పాత కథలకే కొత్త నగిషీలు చెక్కి ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంటారు. అలా పలుమార్లు రీమేక్ కు గురైన కథ ఏదయినా ఉందంటే, మన దేశంలో ‘దేవదాసు’ కథ అనే చెప్పాలి. ప్రముఖ బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటోపాధ్యాయ 1901లో రాసిన ‘దేవదాసు’ నవల 1917 జూన్ 30న ప్రచురితమయింది. ఆ కథ ఆధారంగా 1928లో తొలిసారి ‘దేవదాసు’ చిత్రం తెరకెక్కింది. ఆ పై పలు మార్లు అదే కథ వెండితెరపై వెలిగింది. ప్రముఖ హిందీ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ సైతం శరత్ బాబు ‘దేవదాసు’ నవల చదివి, దానిని సినిమాగా తీసి తీరాలని నిశ్చయించారు. షారుఖ్ ఖాన్ ‘దేవదాసు’గా సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ‘దేవ్ దాస్’ చిత్రం 2002 జూలై 12న విడుదలయి, విజయఢంకా మోగించింది.
శరత్ చంద్రుని ‘దేవదాసు’లో దేవదాసు, పార్వతి బాల్యం నుంచీ కథ మొదలవుతుంది. భన్సాలీ తన దేవదాసులో హీరో చదువులు పూర్తి చేసుకొని, లండన్ నుండి వస్తున్నాడని ఉత్తరం ద్వారా తెలుసుకున్న అతని తల్లి సంబరపడిపోయే దృశ్యంతో కథ ఆరంభమవుతుంది. కథ ఎలా మొదలు పెట్టినా, ముగింపు మాత్రం పార్వతి ఇంటి ముందు ఓ చెట్టు కింద దేవదాసు ప్రాణం విడవడమే ఇందులోనూ కనిపిస్తుంది. శరత్ ‘దేవదాసు’లో చిన్ననాటి నుంచీ ఎంతో అన్యోన్యంగా ఉన్న దేవదాసు, పార్వతి నిష్కల్మషమైన ప్రేమ ఉంటుంది. పెద్దయ్యాక పట్నంలో చదువుకొని వచ్చిన దేవదాసుకు పార్వతిలో చిన్ననాటి నేస్తం కనిపిస్తుంది. కానీ, ఆమె మాత్రం అతనిపై ప్రేమ పెంచుకొని ఉంటుంది. దాంతో ధైర్యం చేసి ఓ నాటి రాత్రి వెళ్ళి దేవదాసుతో ప్రేమ, పెళ్ళి విషయాలు చర్చించడం జరుగుతుంది. అందుకు దేవదాసు కంగారు పడతాడు
ఇంట్లో దేవదాసు తన తండ్రితో ఆ విషయం చెబితే ఆయన కాదంటాడు. ఆ విషయం పార్వతికి తెలుస్తుంది. పట్నం వెళ్ళిన దేవదాసుకు తాను పార్వతిని కోల్పోతే జీవితమే ఉండదని భావించి, తిరిగి వస్తాడు. అయితే అప్పటికే పార్వతికి మరో ఊరి జమీందార్ తో పెళ్ళి నిశ్చయమై పోయి ఉంటుంది. పార్వతి సైతం తన పెద్దవారి మాట నిలబెట్టాలనే పంతంతో ఆ పెళ్ళికే సై అంటుంది. దేవదాసు హతాశుడవుతాడు. చేజారిపోయిన పార్వతిని తలచుకుంటూ తాగుడుకు బానిసకావడం, మిత్రుని ద్వారా చంద్రముఖి పరిచయం కావడం జరుగుతాయి. ఆమె నాట్యంతో అందరినీ డబ్బు కోసం ఆకర్షిస్తూ ఉంటుందని తెలిసి, చీదరించుకుంటాడు దేవదాసు. ఆ చీదరింపే చంద్రముఖిలో పరివర్తన తెస్తుంది. దేవదాసును ఆరాధిస్తుంది. తాగుడుకు బానిస అయిన దేవదాసు నీచస్థితికి చేరుకున్నాడని తెలిసి, ఓ సారి ఊరికి వచ్చిన దేవదాసును కలసి, తనతో రమ్మంటుంది పార్వతి. చచ్చేలోగా ఓ సారి వస్తానంటాడు దేవదాసు. చంద్రముఖి, దేవదాసు తాగుడు చూసి భయపడుతుంది. ఎలాగైనా బాగు చేయాలనుకుంటుంది. కానీ, అప్పటికే తాగుడు వల్ల అతని ఆరోగ్యం చెడిపోయి ఉంటుంది. కొద్దిరోజులే బ్రతుకుతాడని డాక్టర్ చెప్పడం విని, చనిపోయేలోగా పార్వతి దగ్గరకు వెళ్ళాలని ఆమె ఊరికి పలు కష్టాలు పడి పోతాడు దేవదాసు. చివరకు ఆమె ఇంటిముందే ఓ చెట్టుకింద తుదిశ్వాస విడుస్తాడు. ఇదీ శరత్ రాసిన దేవదాసు కథ. దీనికే అటుఇటుగా మార్పులు చేసి చిత్రాలు రూపొందించారు.
సంజయ్ లీలా భన్సాలీ తన ‘దేవదాసు’లో భలే స్వేచ్ఛ తీసుకున్నారు. పార్వతిని, చంద్రను కలిపేశారు. వారిద్దరూ కలసి నాట్యం చేసేలా చేశారు. ఇన్నీ చేసి చివరకు దేవదాసును ఒంటరివాడిగానే జీవితం చాలించేలా చేయడం మరచిపోలేదు. ప్రఖ్యాత గాయకుడు కుందన్ లాల్ సైగల్ ‘దేవదాస్’గా 1935లో పి.సి.బారువా హిందీ చిత్రం రూపొందించారు. నటగాయకుడైన కె.ఎల్.సైగల్ నటించిన ఆ ‘దేవదాస్’ ఆయన పాటలతో విజయం సాధించింది. 1955లో బిమల్ రాయ్ రూపొందించిన ‘దేవదాస్’లో దిలీప్ కుమార్ హీరోగా నటించారు. ఇందులో చంద్రముఖి పాత్రలోని ఔన్నత్యం ప్రధానాంశంగా మారింది. ఈ సినిమా సైతం ఘనవిజయం సొంతం చేసుకుంది. దిలీప్ కుమార్ కు అప్పటికే ‘ట్రాజెడీ కింగ్’ అనే పేరుండేది. ‘దేవదాస్’లో నటించిన తరువాత దిలీప్ కు ఆ పేరు స్థిరపడి పోయింది. బారువా ‘దేవ్ దాస్’, బిమల్ రాయ్ ‘దేవ్ దాస్’ను మిళితం చేసి, తనదైన ‘దేవ్ దాస్’ను రూపొందించారు సంజయ్ లీలా భన్సాలీ. ఈయన సినిమా సైతం మ్యూజికల్ హిట్ గా నిలచి విజయం సాధించింది.
ఇందులో ఐశ్వర్యారాయ్ పార్వతిగా నటించగా, మాధురీదీక్షిత్ చంద్ర పాత్రలో అభినయించారు. దేవదాస్ మిత్రుడు చున్నీలాల్ గా జాకీ ష్రాఫ్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. స్మితా జయకర్, కిరణ్ ఖేర్, మనోజ్ జోషి, అనన్య ఖరే, మిలింద్ గునాజీ, దినా పాథక్, విజయేంద్ర ఘట్గే, టికు తల్సానియా, జయ భట్టాచార్య, అమర్ దీప్ ఝా, అపర మెహతా, దిశావకానీ తదితరులు నటించారు.
ఈ ‘దేవ్ దాస్’ కు సంజయ్ లీలా భన్సాలీ, ప్రకాశ్ రంజిత్ కపాడియాతో కలసి రచన చేశారు. ఈ చిత్రానికి ఇస్మాయిల్ దర్బార్, బిర్జూ మహరాజ్ పాటలకు బాణీలు కట్టారు. నేపథ్య సంగీతాన్ని మోన్టీ శర్మ సమకూర్చారు. భరత్ షా ఈ చిత్రాన్ని నిర్మించారు. నితిన్ చంద్రకాంత్ దేశాయ్ రూపొందించిన సెట్స్ ‘దేవ్ దాస్’కు ఓ ప్రత్యేక కళ తీసుకు వచ్చాయి. ఇక సంజయ్ లీలా భన్సాలీ మనోఫలకంపై ముద్రితమైన రంగులను తన మదిలో నింపుకొని బినోద్ ప్రధాన్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. దాంతో ‘దేవ్ దాస్’ సరికొత్త కళతో ప్రేక్షకులను అలరించింది. నస్రత్ బద్ర్, బిర్జూ మహరాజ్, సమీర్ అంజాన్ పాటలు రాశారు. ఇందులోని “సిల్ సిలా యే చాహత్ కా…”, “మార్ డాలా…”, “డోలారే…”, “చలక్ చలక్…”, “కాహే ఛేడ్…”, “హమేషా తుమ్ కో చాహా…”, “మోరే పియా…”, “వో చాంద్ జైసీ లడ్కీ…” అంటూ సాగే పాటలు అలరించాయి. ముఖ్యంగా మాధురీ దీక్షిత్, ఐశ్వర్యారాయ్ పోటీ పడి డాన్స్ చేసిన “డోలా రే డోలా రే…” పాట ప్రేక్షకులను కట్టిపడేసిందని చెప్పవచ్చు.
భన్సాలీ ‘దేవ్ దాస్’ రూ. 50 కోట్లతో తెరకెక్కింది. అప్పట్లో మన దేశంలో ఇది భారీ చిత్రం. పాత తరం ప్రేక్షకులు దిలీప్ కుమార్ స్థాయిలో షారుఖ్ నటించలేదని కొట్టి పారేశారు. అయితే నవతరాన్ని షారుఖ్ ‘దేవ్ దాస్’ భలేగా ఆకట్టుకుంది. మంచి లాభాలు చూసింది. ఇందులోని “బైరీ పియా…” పాటతో శ్రేయాఘోషల్ ఉత్తమగాయనిగా జాతీయ అవార్డును అందుకున్నారు. “డోలా రే డోలా రే…” పాటకు నృత్యం సమకూర్చిన సరోజ్ ఖాన్ బెస్ట్ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు. సంజయ్ లీలా భన్సాలీ తన విజువలైజేషన్ తో ‘దేవ్ దాస్’ను అదరహో అనిపించేలా రూపొందించారు. జనం సైతం అదే రీతిన ఆయన ‘దేవ్ దాస్’ను ఆదరించారు.
from NTV Telugu https://ift.tt/kzloihd
Post a Comment
Post a Comment