Telangana: ‘ప్లీజ్ సార్.. మీరు ఇక్కడి నుంచి వెళ్లొద్దు’.. స్కూల్ ప్రిన్సిపాల్‌ను ప్రాథేయపడుతున్న విద్యార్థులు..

Khammam District

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో జరిగిన కీచక టీచర్ ఇన్సిడెంట్‌కి పూర్తి రివర్స్ సీన్ ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. మంచి టీచర్‌కు విద్యార్థులు ఎలాంటి విలువ ఇస్తారనేది ఈ ఘటన ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఖమ్మం జిల్లా కామేపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెడ్‌మాస్టర్‌ చుట్టూ చేరి భోరున విలపిస్తున్నారు విద్యార్ధినులు. ఆయనకేదో అయ్యింది, అందుకే ఏడుస్తున్నారని అనుకుంటే పొరపాటే. బదిలీపై వెళ్తోన్న మాస్టర్‌ను వెళ్లొద్దంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మాస్టారూ మీరు వెళ్లొద్దంతే అంటూ భోరున విలపించారు. పిల్లలంతా చుట్టూ చేరి అలా విలపిస్తుంటే, ఆ మాస్టర్‌ కూడా కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడున్నవారందర్నీ ఏడ్చేలా చేసింది.

మీరు వెళ్లొద్దు మాస్టారూ అంటూ ఏడుస్తుంటే, వాళ్లను సముదాయించడం ఆయన వల్లకాలేదు. తనపట్ల విద్యార్ధినులు చూపించిన అభిమానానికి పదేపదే కన్నీళ్లు పెట్టుకున్నారు టీచర్‌ నాగేశ్వర్రావు. విద్యార్ధినులకు చేతులు జోడిస్తూ వాళ్లను సముదాయించే ప్రయత్నం చేశారు. వెళ్లక తప్పదమ్మా అంటూ భారమైన మనసుతో అక్కడ్నుంచి నిష్క్రమించారు మాస్టర్‌ నాగేశ్వర్రావు. కామేపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో నాగేశ్వర్రావు పనిచేసింది ఏడాదే. కానీ, విప్లవాత్మక నిర్ణయాలతో స్కూల్ రూపురేఖలే మార్చేశారు.

మంచి విద్యాబోధన అందిస్తూ వందశాతం ఫలితాలు సాధించారు. మంచి ఫుడ్‌ మెనూ అందేలా చేశారు. అంత మంచి మాస్టర్‌ వెళ్లిపోతుంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు. అందుకే, పిల్లలంతా కలిసి.. టీచర్‌ నాగేశ్వర్రావును వెళ్లొద్దంటూ అడ్డుకున్నారు. చేతులెత్తి దండం పెడుతూ మీరే మా దేవుడు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..



from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/YtVjo95

Baca juga

Post a Comment