Telangana: అయ్యో దేవుడా.. పడి పూజకు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. అయిదుగురు దుర్మరణం

Road Accident

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మునగాలలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మునగాల శివారులోని పెట్రోల్‌ బంక్‌ వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అయిదుగురు దుర్మరణం చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని వెల్లడించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మునగాల మండల కేంద్రానికి చెందిన పలువురు.. సమీపంలోని సాగర్‌ ఎడమ కాలువ గట్టుపై ఉన్న అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం రాత్రి మహాపడి పూజకు హాజరయ్యారు.

వారిలో దాదాపు 30 మంది ట్రాక్టర్‌లో ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సమయంలో వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ విజయవాడ – హైదరాబాద్‌ జాతీయ రహదారిపై రాంగ్‌ రూట్‌లో వస్తోంది. ఈ క్రమంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న లారీ.. ట్రాక్టర్ ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ లోని వారంతా చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోయారు. లారీ వేగంతో ఉండటంతో ట్రాక్టర్‌ను ఢీకొట్టి 50 మీటర్ల దూరం వరకూ లాక్కెళ్లింది.

సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కోదాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్‌లతోపాటు.. ఇతర వాహనాల్లో కూడా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులు తన్నీరు ప్రమీల, చింతకాయల ప్రమీల (33), ఉదయ్‌ లోకేశ్‌ (8), నారగాని కోటయ్య (55) మార్గంమధ్యలో ప్రాణాలు కోల్పోగా.. గండు జ్యోతి(38) చికిత్స పొందుతూ మరణించింది.

పరిస్థితి విషమంగా ఉన్నవారిని ఖమ్మం, సూర్యాపేట ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై  ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రమాదసమయంలో ట్రాక్టర్ లో 30 మంది ఉన్నారని పేర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..



from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/1OLuVTU

Baca juga

Post a Comment