Gold: బంగారమంటే సాక్షాత్తూ భగవంతుడే!.. మహిళలకు పసిడితో ప్రయోజనాలెన్నో.. ఇది చదివితే మీరు ఒప్పుకుంటారు..

బంగారాన్ని భగవంతుడితో పోల్చడం ఏమిటని కొందరు భావించవచ్చు. అయితే, బంగారానికి ఉన్న విలువ, ప్రాధాన్యం అటువంటివని ఋగ్వేద కాలం నుంచి వస్తున్న ఆచార సంప్రదాయాలు, అనుభవాలు, సామాజిక పరిస్థితులు, నిర్ధారణల ద్వారా అర్థం అవుతోంది. బంగారానికి సామాజిక, ఆర్థిక పరంగానే కాక, జ్యోతిష పరంగా కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది. మహిళలు ఎక్కువగా బంగారు ఆభరణాలను ధరించడం, వాటి మీద విపరీతంగా మక్కువ కలిగి ఉండటం కొందరికి అభ్యంతరం, ఆక్షేపణ కలిగించవచ్చు. కానీ, బంగారం మీద మహిళలకు మక్కువ ఉండటం అనేది సామాజిక అవసరం అని, సామాజిక భద్రత అని అర్థం చేసుకోవాల్సి ఉంది. కుటుంబంలోని మహిళలకు పురుషులు తమ జీవితకాలంలో వీలైనంత బంగారాన్ని కొని ఇవ్వాల్సిందేనని, అది ఆ మహిళల కే కాక, కొని ఇచ్చిన పురుషులకు కూడా అదృష్టదాయకమని వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు వగైరాలతో పాటు జ్యోతిష్య శాస్త్రం కూడా మరీ మరీ నొక్కి చెబుతున్నాయి.
మహిళలకు బంగారు ఆభరణాలను సమకూర్చడంపై మహాభారతంలో ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. పాండవులు అజ్ఞాతవాసం గడపటానికి బయలుదేరారు. వారు విరాట రాజు రాజ్యం దగ్గరకు వచ్చిన తర్వాత ఒక శమీ వృక్షం మీద తమ ఆయుధాలను దాచిపెట్టారు. అప్పటికి ద్రౌపది ఒంటి నిండా ఆభరణాలు ఉన్నాయి. ఆమె రాణి కదా! వాళ్లు ఆభరణాలు లేకుండా బయటికి కనిపించడం అనేది జరగనే జరగదు. ఆమె ధరించిన ఆభరణాలను ఎక్కడ దాచాలనే మీ మాంస వచ్చింది. ఆమె ఆభరణాలు ధరించి ఉండటం చూసి భీముడు మండిపడ్డాడు. ద్రౌపది మీద ఆగ్రహం వెళ్ళగక్కాడు. ధర్మరాజు వెంటనే కల్పించుకొని, “బంగారు ఆభరణాలు ధరించడం మహిళలకు స్వతసిద్ధంగా ఉండే గుణం. వాళ్ల జీవితాల్లో భర్త తర్వాత అంతటి ముఖ్యమైన పాత్ర పోషించేది బంగారమే” అని చెప్పి భీముడిని శాంతింప చేశాడు. మహిళలు బంగారాన్ని ధరించడం అనే అంశానికి ఎంత ప్రాధాన్యం ఉందో ధర్మరాజు మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. మహిళలకు బంగారం సామాజిక భద్రతనే కాక, ఆర్థిక స్వాతంత్రాన్ని, సాధికారికతను కూడా ఇస్తుంది. భర్తకు అర్ధాంతరంగా ఏదైనా విపత్తు వాటిల్లి నప్పుడు ఆమెను, ఆ కుటుంబాన్ని కాపాడేది, ఆదుకునేది బంగారమే. అందువల్ల భార్యకు తప్పనిసరిగా తన జీవితంలో భద్రత కల్పించడం భర్త కనీస బాధ్యత. రకరకాలుగా పొదుపు చేసి, మదుపు చేసి, పెట్టుబడులు పెట్టి భార్యకు సామాజిక భద్రత కల్పించడంతోపాటు, బంగారం సమకూర్చి కూడా భద్రత కల్పించాల్సిన అవసరం ఉంటుంది.
భర్త కంటే ఎక్కువ..
బంగారం వల్ల మహిళలకు అనేక ప్రయోజనాలు ఉన్నందువల్లే దీన్ని భగవంతుడితో పోల్చడం జరిగింది. ధర్మరాజు బంగారాన్ని భర్త కంటే ఎక్కువ అని అభివర్ణిస్తే వేదాలు, పురాణాలు దీన్ని ఏకంగా భగవంతుడితో పోల్చి చెప్పాయి. బంగారు ఆభరణాలైన కంఠాభరణాలు, గాజులు, వడ్డాణాలు, కమ్మలు, మంగళ సూత్రాలు తదితర వాటన్నిటి వెనుక శాస్త్రీయమైన ఆరోగ్య రహస్యాలు ఉన్నాయని ఈ మధ్యకాలంలో వెల్లడయింది. ఈ విషయాన్ని పురాణ కాలంలోనే గుర్తించి ఉంటారని అర్థమవుతూనే ఉంది. వెండి తదితర లోహాల కంటే, రత్న మాణిక్యాల కంటే, మొదటి నుంచి బంగారానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటూ వచ్చింది. మహిళలు బంగారం ధరించాల్సిన అవసరం పై భారత దేశంలోనే కాక మరికొన్ని దేశాల్లో కూడా అధ్యయనం జరిగింది. రుతు సమస్యలు, ప్రసవాల కారణంగా పురుషుల కంటే మహిళలు శారీరకంగా ఎంతో బలహీనంగా ఉంటారని, పురుషులతో సమానంగా వారిలో శక్తి, సత్తువ లు పెరగాలంటే అందుకు బంగారమే సరైన మందు అని అధ్యయనంలో తేలింది. శరీరంలో రక్తప్రసారం సరిగ్గా ఉండాలన్నా, ఎముకలు గట్టిగా ఉండాలన్నా, నాడీ వ్యవస్థ సజావుగా పనిచేయాలన్నా అందుకు సరైన తేలిక మార్గం బంగారాన్ని ధరించడమేనని తేలిపోయింది. బంగారానికి రోగనిరోధక శక్తి, రోగాన్ని నయం చేసే శక్తి ఉన్నాయని శాస్త్రీయంగా కనుగొన్నారు.
ఇక జ్యోతిష పరంగా కూడా బంగారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అదృష్టం ఉంటేనే బంగారాన్ని ధరిస్తారని చెప్పడం సరికాదని, బంగారం ధరించడం వల్లే అదృష్టం పడుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ప్రామాణిక స్త్రీ జాతక గ్రంథాలు ఈ విషయాన్ని ఉదాహరణలతో సహా వివరించాయి. మహిళల జీవితాల్లో జ్యోతిష పరంగా బంగారానికి ఉన్న ప్రాధాన్యం గురించి చెబుతూ, స్త్రీల జాతకాలలో కుజ, కాలసర్ప, శని, చంద్ర దోషాలున్న పక్షంలో వారు మెడకు, చేతులకు, వేళ్ళకు బంగారం ఆభరణాలు ధరిస్తే ఆ దోషాలు కొట్టుకుపోతాయని ఆ గ్రంథాలలో చెప్పారు. బంగారానికి, అదృష్టానికి లంకె ఉందని అవి నిర్ధారించాయి.
పురుషులు తమ కుటుంబాలలోని మహిళలకు బంగారం సమకూర్చడానికి ఒకప్పుడు ఏడాదిలో కొన్ని ప్రత్యేక సందర్భాలు ఉండేవి. ఇప్పటి అక్షయ తృతీయ మాదిరిగానే ఒకప్పుడు శ్రావణ మాసం, వరలక్ష్మీ వ్రతం, విజయదశమి, దీపావళి పర్వదినాల్లో తప్పనిసరిగా బంగారం కొనడం జరిగేది. శుభకార్యాల్లో కూడా విధిగా బంగారాన్ని సమకూర్చుకునేవారు. మహిళలకు బంగారం ఒక నమ్మదగిన, ఆధారపడదగిన ఆస్తి. వాళ్లు ఎంత బంగారాన్ని కూడగట్టుకుంటే జీవితానికి అంత మంచిది. బంగారం మంచి పెట్టుబడి. ఇది మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని, మనో నిబ్బరాన్ని పెంపొందిస్తుంది.
from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/UcimSGk
Post a Comment
Post a Comment