BJP Posts in Telangana… Off The Record: ఆ పదవులు మా కొద్దంటున్న కార్యదర్శులు

Bjp Pracharak

బీజేపీలో సంస్థాగత ప్రధాన కార్యదర్శులది కీలక పాత్ర. ఈ పదవిని RSS నుంచి వచ్చే ప్రచారక్‌లకు అప్పగిస్తారు. అలా రాష్ట్రానికి ఒకరో ఇద్దరో ఉంటారు. కానీ.. తెలంగాణలో సంస్థాగత ప్రధాన కార్యదర్శి లేరు. ఏడాదిలో ఎన్నికలకు వెళ్తున్న తెలంగాణలో కీలక కుర్చీని బీజేపీ ఖాళీగా ఉంచింది. ఎందుకలా? కాషాయ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి?

బీజేపీలో సంస్థాగత ప్రధాన కార్యదర్శులది కీలక బాధ్యత
ఇతర రాజకీయ పార్టీలతో పోల్చితే బీజేపీ సంస్థాగత నిర్మాణం వేరే విధంగా ఉంటుంది. సంస్థాగత వ్యవహారాలు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ప్రధాన కార్యదర్శులు ఉంటారు. ఆ పనులు చూసేందుకు.. ఆ బాధ్యతలు చేపట్టేందుకు RSS నుంచే వస్తారు. అలా వచ్చిన ప్రచారక్‌లను వారి స్థాయి.. సమర్థత ఆధారంగా జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో పగ్గాలు అప్పగిస్తారు. తెర వెనుక పార్టీ పనులను చక్క బెట్టేది వారే. అందరినీ సమన్వయం చేసుకునే బాధ్యత కూడా వాళ్లదే. ముఖ్యమైన బాధ్యత కావడంతో వాళ్లకు ప్రాధాన్యం కూడా ఎక్కువగానే ఉంటుంది.

మంత్రి శ్రీనివాస్‌ పంజాబ్‌ వెళ్లాక.. తెలంగాణలో ఆ పోస్టు ఖాళీ
ప్రస్తుతం బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా B L సంతోష్ ఉన్నారు. ఆయనకు తోడుగా సహా ప్రధాన కార్యదర్శి హోదాలో శివప్రకాష్ కొనసాగుతున్నారు. ఇద్దరూ RSS ప్రచారక్‌లే. తెలంగాణలో మొన్నటి వరకు మంత్రి శ్రీనివాస్‌ రాష్ట్ర బీజేపీలో సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. ఆయనకు పంజాబ్‌ బాధ్యతలు అప్పగించడంతో హైదరాబాద్‌ నుంచి వెళ్లిపోయారు. రోజులు.. నెలులు గడుస్తున్నా.. సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఆ పోస్టులోకి కొత్త ప్రచారక్‌ రాలేదు. జూలై 21 నుంచి తెలంగాణ బీజేపీలో ఆ పోస్టు ఖాళీ. మరో ఏడాదిలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలు స్పీడ్‌ అందుకున్నాయి. ఇలాంటి సమయంలో సంస్థాగత ప్రధాన కార్యదర్శిని నియమించకుండా కాలం వెళ్లదీయడం కమలదళాన్నే ఆశ్చర్య పరుస్తోంది.

బీజేపీలో బాధ్యతలు చేపట్టడానికి ఆసక్తి చూపని ప్రచారక్‌లు..!
ఆ పోస్టును భర్తీ చేయాలంటే అందుకు తగిన ప్రచారక్‌ను RSS పంపించాలి. అందుకే ఒక ప్రచారక్‌ను ఇవ్వాలని ఆ మధ్య శివప్రకాష్‌.. సంఘ్‌ పెద్దలను కలిసి విన్నవించారట. అయితే బీజేపీలో ఆ బాధ్యతలు తీసుకునేందుకు ప్రచారక్‌లు అంతా ఆసక్తి చూపించడం లేదని సమాచారం. జరుగుతున్న పరిణామాల వల్లో లేక.. రాజకీయ క్షేత్రంలోకి రావడానికి ఇష్టం లేదో కానీ.. చాలా మంది నో చెప్పేస్తున్నారట. సంఘ్‌ పరివార్‌లో రాజకీయ క్షేత్రం కాకుండా ఇతర ఏ విభాగాలకు పంపినా ఓకే అంటున్నారట ప్రచారక్‌లు. పైగా మంత్రి శ్రీనివాస్‌ను పంజాబ్‌కు పంపేటప్పుడు.. తెలంగాణలోని సంఘ్‌ పెద్దలకు ఆ సమాచారం ఇవ్వలేదట. ప్రస్తుతం బీజేపీకి ప్రచారక్‌లను ఇవ్వకపోవడానికి అది కూడా ఒక కారణంగా విశ్లేషిస్తున్నారు కొందరు నాయకులు.

తెలంగాణ బీజేపీలో సమన్వయం చేసేవాళ్లు లేరా?
తెలంగాణలో బీజేపీ పుంజుకోవడం.. పాగా వేయడం సంఘ్‌కు కూడా కీలకం కావడంతో.. ఒక ప్రచారక్‌ను పంపించే ఆలోచనలో ఉన్నట్టు మరో వాదన ఉంది. అయితే అది ఎప్పుడు అన్నది ప్రశ్న. కీలక సమయంలో ముఖ్య పోస్ట్‌ ఖాళీగా ఉంటే.. అది సంస్థాగత వ్యవహారాలపై తీవ్ర ప్రభావం చూపెడుతుందనే అభిప్రాయం బీజేపీలో ఉంది. మొన్నటి వరకు పార్టీలో ఏదైనా సమస్య ఎదురైతే.. సంస్థాగత ప్రధాన కార్యదర్శికి వెళ్లి చెప్పుకొనేవారు. ఇప్పుడా కుర్చీ ఖాళీగా పడి ఉంది. సమన్వయం చేసే వాళ్లే కరువయ్యారు. దాంతో సంస్థాగత నిర్మాణం.. బూత్‌ కమిటీల ఏర్పాటుపై తీవ్ర ప్రభావం చూపెడుతోందని బీజేపీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో సునీల్ బన్సాల్‌ తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టినా.. హైదరాబాద్‌లో ఒకరంటూ లేకపోతే కష్టమేనన్నది కమలనాథులు భావన. మునుగోడు ఉపఎన్నికలో ఆ ప్రభావం కనిపించిందని చెబుతున్నారు. మరి.. బీజేపీ అగ్రనాయకత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.



from NTV Telugu https://ift.tt/p3NhYtb

Baca juga

Post a Comment